సాంకేతిక సమస్యలతో లబ్ధిదారులకు తప్పని తిప్పలు
జనం న్యూస్, సెప్టెంబర్ 12: తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి నూతన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు ప్రక్రియలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠినమైన నిబంధనలు, సాంకేతిక లోపాల కారణంగా అర్హులైన వృద్ధులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నీరుకొండ వీరన్న చౌదరి ఒక ప్రకటనలో వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 60 ఏళ్లు దాటి, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడూ వృద్ధాప్య పింఛన్‌కు పూర్తి అర్హుడైనప్పటికీ, క్షేత్రస్థాయిలో సచివాలయ సిబ్బంది ఆన్లైన్ డేటా అప్డేట్ సాకుతో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల పేరిట అదనపు పత్రాలను అడగడం వల్ల వృద్ధులు ఈ వయసులో మీసేవ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు హౌస్‌హోల్డింగ్ మ్యాపింగ్, రైస్ కార్డు మ్యాపింగ్, స్కిప్పింగ్, ఓటర్ ఐడీ బూత్ మార్పులు మరియు ఒకే హౌస్‌హోల్డింగ్‌లో కుటుంబ సభ్యుల మ్యాపింగ్ సరిగా జరగకపోవడం వంటి అనేక సాంకేతిక సమస్యల వల్ల అర్హత ఉన్నప్పటికీ పలువురు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని, పైగా కేవలం వారం రోజుల స్వల్ప గడువు ఇవ్వడం మరియు సర్వర్లు నిలిచిపోవడంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అయన మండిపడ్డారు. శని, ఆది, సోమవారాలు వరుసగా మూడు రోజులు ప్రభుత్వ సెలవులు రావడం దరఖాస్తుదారులకు శాపంగా మారిందని, గడువు పొడిగించకపోతే ఎలాంటి తప్పు చేయని అర్హులైన పేదలు ప్రభుత్వ సంక్షేమానికి దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు ఆయన, పింఛన్ అనేది కేవలం ఒక పథకం కాదని, అది పేదల బతుకు తెరువుకు ప్రభుత్వమిచ్చే భరోసా అని గుర్తు చేశారు. తక్షణమే ఈ సాంకేతిక సమస్యలను పరిష్కరించి, దరఖాస్తు గడువును పెంచాలని, డిమాండ్ చేశారు.