అమలాపురంలో కూటమి నేతల సమన్వయ కమిటీ సమావేశం
జనం న్యూస్ సెప్టెంబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం: స్థానిక ఎన్నికల సమరంలో భాగంగా అమలాపురం మెట్రో క్యాంప్ అధినేత నందెపు బాలాజీ అతిథి గృహంలో కూటమి నేతల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సుమారు అరగంట పాటు నేతలు వివిధ అంశాలపై చర్చించారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమన్వయంతో ముందుకు సాగాలని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు గుత్తుల సాయి, మాజీ శాసనసభ్యుడు మానేపల్లి అయ్యాజీ వేమా, బండారు శ్రీనివాస్, ఐతాబత్తుల ఉమామహేశ్వరరావు, ముత్యాల జయ, కర్రి చిట్టిబాబు, అడబాల సత్యనారాయణ, గంధం పల్లంరాజు తదితర కూటమి నేతలు పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం స్థానిక రాజకీయాలకే పరిమితం కావని, 2029 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కీలకంగా మారనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే కూటమి శ్రేణులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూటమి పార్టీల మధ్య సమన్వయం బలోపేతం చేసి, ప్రతి నియోజకవర్గంలో స్థానిక పరిస్థితులను అంచనా వేసి బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. ఎన్నికల్లో వ్యక్తిగత విభేదాలకు తావులేకుండా కూటమి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందరూ కలిసి పనిచేయాలని, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మున్సిపాలిటీలపై కూటమి జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నేతలు పేర్కొన్నారు.