జనం న్యూస్, సెప్టెంబర్ 17: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్‌కు చెందిన రోబోటిక్స్ ఇన్ అకాడెమిక్స్ ఆధ్వర్యంలో, భారత్ కేర్స్ సహకారంతో ఒకరోజు ప్రాక్టికల్ రోబోటిక్స్ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో తొలిసారిగా రోబోటిక్స్ క్లబ్‌ను ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రాయోగిక శిక్షణ అందించారు. వర్క్‌షాప్‌లో 76 మంది విద్యార్థులు పాల్గొనగా, వారిలో 36 మంది బాలికలు, 40 మంది బాలురు ఉన్నారు. రోబోటిక్స్ ప్రాథమిక అంశాలు, ఎలక్ట్రానిక్స్, సెన్సర్లు, మోటార్లు, సర్క్యూట్ నిర్మాణం, రోబోటిక్ పరికరాల వినియోగంపై విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు. విద్యార్థులు స్వయంగా సర్క్యూట్లు రూపొందించి, రోబోటిక్ నమూనాలను తయారు చేసి ప్రాయోగిక కార్యకలాపాల్లో పాల్గొన్నారు.ఈ శిక్షణతో విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలు, జట్టు భావన, సాంకేతిక ఆలోచనా విధానం పెంపొందుతాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి తెలిపారు. వర్క్‌షాప్ ముగింపులో విద్యార్థులకు పాల్గొన్న ధ్రువపత్రాలు అందజేశారు. పాఠశాలలో రోబోటిక్స్ కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రాక్టీస్ కిట్‌ను, క్లబ్ సభ్యులకు రోబోటిక్స్, కృత్రిమ మేధస్సుపై హ్యాండౌట్లను అందించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు మునిరుద్దీన్, ప్రసాద్, సమిత, రాజేందర్, విజయ్ కుమార్, గంగాధర్, ప్రవీణ్, జ్యోతి, ట్వింకిల్, గంగమోహన్, శ్యామల, కృష్ణవేణి, రిషిక తదితరులు పాల్గొన్నారు.