
టైలరింగ్ వృత్తితో జీవితాన్ని తీర్చిదిద్దుకున్న ఆదర్శ తండ్రి
జనం న్యూస్, సెప్టెంబర్ 20: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ళ రాంపూర్ లో ఉన్న రాంపెల్లి జనార్దన్ కుటుంబ పోషణ కోసం ఎన్నో కష్టాలు పడుతూ, పిల్లల భవిష్యత్తు కోసం జీవితాన్ని అంకితం చేసిన ఓ తండ్రి కథ ఇది. వృత్తిపై నమ్మకంతో, కష్టపడి పనిచేస్తే జీవితంలో ఎన్నో విజయాలు సాధించవచ్చని నిరూపిస్తున్నాడు.టైలరింగ్ వృత్తిని నమ్ముకుని కుటుంబాన్ని పోషించిన ఆయన, ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు కొన్నేళ్ల క్రితం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ పనిచేశారు. అక్కడ సంపాదించిన డబ్బుతో కుటుంబ అవసరాలను తీర్చడంతో పాటు, పిల్లల భవిష్యత్తుకు బాటలు వేశారు. కొన్నేళ్ల అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చి చిన్న బట్టల దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు.తన పిల్లల చదువులు, పెళ్లిళ్ల బాధ్యతలను నెరవేర్చేందుకు నిరంతరం శ్రమించారు. ముఖ్యంగా తన కుమారుడిని ఉన్నతంగా చదివించి, బ్యాంకు మేనేజర్‌గా తీర్చిదిద్దడంలో తండ్రిగా తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించారు. పిల్లలు జీవితంలో స్థిరపడినప్పటికీ, తాను మాత్రం శ్రమను వీడలేదు.ఖాళీగా ఉండకూడదనే ఆలోచనతో..పిల్లలు తమ జీవితాల్లో స్థిరపడిన తర్వాత కూడా ఎవరి మీదా ఆధారపడకుండా, ఖాళీగా ఉండకూడదనే ఉద్దేశంతో తన బట్టల దుకాణాన్ని కొనసాగిస్తున్నారు. దుకాణం నిర్వహించడంతో పాటు లేడీస్ టైలర్‌గా పనిచేస్తూ తన వృత్తిపట్ల ఉన్న నిబద్ధతను చాటుతున్నారు.వయసు పెరిగినా పని చేయాలనే సంకల్పం, కుటుంబం కోసం చేసిన త్యాగాలు, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దిన తీరు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తు న్నాయి. కష్టపడే మనస్తత్వం ఉంటే వయసు అడ్డంకి కాదని, స్వయం కృషితో జీవితాన్ని గౌరవంగా కొనసాగించవచ్చని ఆయన జీవితం చెబుతోంది.