జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు 22-09-2026 మంగళవారం జర్నలిస్టు కాలనీలోని రహదారి గుంతలతో నిండిపోయి, మట్టి దారిని తలపిస్తోంది. రహదారిపై ఎక్కడ చూసినా గుంతలు, ఎగుడుదిగుడులు కనిపిస్తుండటంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. దుమ్ము లేస్తుండటంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడితే గుంతల్లో నీరు చేరి రహదారి పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. జర్నలిస్టు కాలనీ రహదారి అని మాత్రమే చూస్తే సమస్య తీవ్రత అర్థం కాదు. రాష్ట్రంలోని ప్రముఖ సంతల్లో ఒకటైన పెబ్బేరు సంతకు ప్రతి శనివారం వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వ్యాపారులు, కొనుగోలుదారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. సంతకు వచ్చి వెళ్లే వారిలో చాలామంది ఇదే మార్గాన్ని వినియోగిస్తున్నారు. ప్రతి శనివారం రద్దీతో కనిపించే ఈ రహదారి మిగతా రోజుల్లో గుంతలతో, దుమ్ముతో దర్శనమిస్తోంది. సంతకు వచ్చే వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలు ఈ గుంతలను తప్పించుకుంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజల రాకపోకలకు ఇంతటి ప్రాధాన్యత ఉన్న రహదారి ఏళ్ల తరబడి ఇలాగే ఉండటం ఎంతవరకు సమంజసం? జర్నలిస్టుల సమస్యగా కాకుండా వేలాది మంది ప్రజలు, వ్యాపారులు వినియోగించే ప్రధాన రహదారిగా గుర్తించి అధికారులు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.End