జనం న్యూస్ సెప్టెంబర్ సెప్టెంబర్ 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి పారిశ్రామిక అభివృద్ధి ప్రాంతంలోని రంగధాముని చెరువు రోడ్డు మీదుగా రైన్బో విస్టా, కైథలాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాలకు రాకపోకలు సాగించే వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పారిశ్రామిక అభివృద్ధి ప్రాంతం ప్రవేశం వద్ద నిర్మిస్తున్న పెట్టె ఆకారపు వంతెన పనుల్లో ఒకవైపు నిర్మాణం పూర్తికాగా, మరోవైపు పనులు పూర్తి కావాల్సి ఉంది. వినాయక నిమజ్జనం కార్యక్రమం అనంతరం మిగిలిపోయిన నిర్మాణ పనులను బుధవారం నుంచి అధికారులు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో పనులు కొనసాగుతున్న ప్రాంతంలో వాహనదారులు రహదారిపై ఏర్పాటు చేసిన సూచిక బోర్డులను గమనిస్తూ, వాటికి అనుగుణంగా వాహనాలను నడపాలని పోలీసులు కోరారు. నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో వేగంగా ప్రయాణించకుండా, అప్రమత్తంగా రాకపోకలు సాగించాలని సూచించారు.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సహకరించాలని, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం కావద్దని కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు సహనం పాటించి, సూచించిన మార్గాల్లోనే ప్రయాణించాలని కోరారు.