జనం న్యూస్, సెప్టెంబర్ 24,ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ): కాట్రేనికోన మండలంలో నిర్వహిస్తున్న శిబిరంలో గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు)కి తమ సమస్యల పై వినతిపత్రం అందజేశారు. ఎన్నో సంవత్సరాలుగా రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న తమకు తగిన వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేసి వేతనాలు పెంచాలని,అర్హులైన వారికి ప్రమోషన్ కోటా పెంచాలని,నామినీ వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని, గతంలో రద్దు చేసిన డీఏను పునరుద్ధరించాలని కోరారు. వినతిపత్రం స్వీకరించిన దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, ఉపాధ్యక్షులు తాడి నరసరావు, నాయకులు నాగిడి నాగేశ్వరరావు, నడింపల్లి సుబ్బరాజు, విలేకర్ రాజ, మోకా అప్పాజీ తదితరులు పాల్గొన్నారు.