జనం న్యూస్ సెప్టెంబర్ 29 కోటబొమ్మాళి మండలం : నరసన్నపేట మండలం కొల్లివానిపేట (లుకలాం) గ్రామానికి చెందిన రైతు సుంకర శాంతి భాస్కరరావు వద్ద ఉన్న పుంగనూరు జాతికి చెందిన తొలిసారి ఈనబోయే ఆవు ప్రసవ వేదనతో తీవ్ర ఇబ్బందులు పడింది. తొమ్మిది నెలల గర్భంతో ఉన్న ఆవు మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రసవించేందుకు ఇబ్బంది పడుతుండటంతో అక్కడి సిబ్బంది ప్రసవం చేయించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.దీంతో పరిస్థితి విషమంగా మారడంతో రైతు ఆవును వాహనంలో కోటబొమ్మాళిలోని నిమ్మాడ పశువైద్యాధికారి డా. లఖినేని కిరణ్‌కుమార్ ఇంటి వద్దకు మంగళవారం సాయంత్రం తీసుకువచ్చారు.పశువైద్యాధికారి ఆవును పరీక్షించగా గర్భంలో దూడ ఇప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఎక్కువ సమయం గడిచిపోవడంతో గర్భాశయ ముఖద్వారం తెరుచుకోకపోవడంతో రైతు సమ్మతితో అత్యవసర శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. దీంతో మంగళవారం రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అదే వాహనంలో అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి, మృతి చెందిన దూడను సురక్షితంగా బయటకు తీశారు. ఈ శస్త్రచికిత్సలో శిక్షణలో ఉన్న డా. ఎస్. లావణ్య సహాయకురాలిగా పాల్గొన్నారు.సకాలంలో శస్త్రచికిత్స నిర్వహించడంతో ఆవు ప్రాణాలతో బయటపడి, అనంతరం లేచి నిలబడింది. దీంతో రైతు శాంతి భాస్కరరావు సంతోషం వ్యక్తం చేస్తూ పశువైద్యాధికారికి కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో వైద్య సేవలు అందించడం వల్ల ఆవు ప్రాణాలను కాపాడగలిగామని డా. కిరణ్‌కుమార్ తెలిపారు.