జనం న్యూస్ అక్టోబర్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని వివేకానందనగర్ చౌరస్తా నుంచి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వరకు ప్రధాన రహదారిపై వాహనాల పార్కింగ్, ఆటోలు, తాత్కాలిక షెడ్ల కారణంగా రాకపోకలకు ఏర్పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ ఆదేశాల మేరకు రోడ్డుపై ఉన్న కార్లు, ఆటోలు, షెడ్లను తొలగించి వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేశారు. ప్రధాన రహదారిపై వాహనాలను ఇష్టానుసారంగా నిలపడం వల్ల తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రహదారిపై పార్కింగ్ చేయడం ద్వారా ఇతర వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడుతూ.. వివేకానందనగర్ చౌరస్తా నుంచి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వరకు రహదారిపై ఎవరూ వాహనాలను పార్కింగ్ చేయరాదని స్పష్టం చేశారు. రోడ్డుపై వాహనాలు నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంబంధిత షాపుల యజమానులు కూడా తమ వినియోగదారులు రోడ్డుపై వాహనాలు నిలపకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఎస్‌ఐ ఫిలిప్స్ ఆధ్వర్యంలో సిబ్బంది రహదారిపై పరిస్థితిని పరిశీలించి, వాహనాల రాకపోకలకు ఆటంకంగా ఉన్న పార్కింగ్‌ను తొలగించారు. భవిష్యత్తులోనూ రహదారిపై అక్రమ పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురంధర్ రెడ్డి, ఎన్.చంద్రకాంతరావు, జి.నర్సింగ్‌రావు, లక్ష్మీనారాయణ, శ్రీధర్, సూర్యనారాయణ, జి.ప్రసాద్, జె.పురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.