జనం న్యూస్ నవంబర్ 16: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్, రాష్ట్ర కిసాన్ ఖేత్ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకెట అన్వేష్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ సభ్యులు భాష వేణుగోపాల్ యాదవ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రజిని పంతులు ప్రత్యేక అర్చనలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి వారికి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ ముస్కు మోహన్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఆలయానికి విచ్చేసిన నాయకులకు ఘన స్వాగతం పలికి, శాలువాలతో సన్మానించారు. స్వామివారి చిత్రపటంతో కూడిన జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు
శివాన్నోళ్ల శివ కుమార్,నాయకులు, భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.