జనం న్యూస్ సెప్టెంబర్ 23 ముమ్మడివరం ప్రతినిధి
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల మీ సేవ నిర్వాహకుల ప్రాంతీయ సదస్సు ఈ నెల 27వ తేదీన రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర సంఘం నాయకులు ఐ.వి. నారాయణ, బి. రాజ వర్ధన్ రావు లు తెలిపారు. కాట్రేనికోనలో బుధవారం జరిగిన మీ సేవా నిర్వాహకుల సమావేశంలో వారు మాట్లాడుతూ మీ సేవ కేంద్రాల భవిష్యత్తు, నిర్వాహకుల సమస్యలు, మీ సేవ యూనియన్ బలోపేతం తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు చెప్పారు. రాజమహేంద్రవరంలోని క్వారీ మార్కెట్ వద్ద జీఎన్ఆర్ మినీ ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటల నుంచి సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మీ సేవ నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలు, సూచనలు, సలహాలను తెలియచేయాలని నాయకులు కోరారు. మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను మరింత సమర్థవంతంగా అందించడంతో పాటు నిర్వాహకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడం , మీ సేవ వ్యవస్థ బలోపేతం కోసం కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉభయ గోదావరి జిల్లాల మీ సేవ నిర్వాహకుల సంఘం ( ఎం. ఎన్. ఎస్. ఎస్ )ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సంఘం నాయకులు వెల్లడించారు. ప్రతి మీ సేవ నిర్వాహకుడు సదస్సుకు హాజరై విజయవంతం చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.