గాంధీజీ జయంతి సందర్భంగా తాళ్లరాంపూర్ గ్రామస్థుల సామాజిక సంకల్పం జనం న్యూస్, అక్టోబర్ 02: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ చాట్ల జనార్దన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామస్థులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ బోధించిన సత్యం, అహింస, గ్రామ స్వరాజ్యం వంటి విలువలను స్మరించుకున్నారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు గాంధీజీ చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన ఆశయాలను నేటి తరాలు ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
అనంతరం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గ్రామస్థులు రెండు కీలక సామాజిక సమస్యలపై ప్రతిజ్ఞ చేశారు. బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేస్తామని, బాలికలను చదివించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని ప్రతినబూనారు. బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని నిర్ణయించారు.
అదేవిధంగా పెరుగుతున్న నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని జల వనరుల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగిస్తూ నీటి వృథాను అరికడతామని, భవిష్యత్ తరాలకు నీటి వనరులను కాపాడుతామని సంకల్పించారు. గాంధీజీ జయంతి సందర్భంగా తాళ్లరాంపూర్ గ్రామస్థులు తీసుకున్న ఈ రెండు కీలక సంకల్పాలు సామాజిక బాధ్యతకు ప్రతీకగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బి. ప్రశాంత్, కారోబార్ సాయిరాం, మహిళా మండలి సీఏలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.