ఇంటి పనిమనుషులే బంగారు బిస్కెట్, నగదు చోరీ.. 100 గ్రాముల బంగారు బిస్కెట్ స్వాధీనం

June 30, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందు ఫార్చ్యూన్ ఫీల్డ్స్ విల్లాలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇంటి పనిమనుషులుగా పనిచేస్తున్న ఇద్దరు సోదరీమణులు బంగారు బిస్కెట్‌తో పాటు నగదును అపహరించిన ఘటనలో వారిని అరెస్టు చేసి, వంద గ్రాముల 24 క్యారెట్ల బంగారు బిస్కెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విల్లా నెం.253లో అద్దెకు నివసిస్తున్న ఉద్దగిరి తాతారావు ఇంట్లో కొణాల రమ్య (36), ఆమె సోదరి కర్రి నాగలక్ష్మి (34) ఇంటి పనిమనుషులుగా పనిచేస్తున్నారు. ఈ ఏడాది మే 19న ఇంటి యజమాని భార్య నాగ ఉదయ భాస్కరం తొందరలో రెండో అంతస్తులోని అల్మారాను తెరిచి మూయడం మరిచిపోయారు. దీనిని గమనించిన ఇద్దరు సోదరీమణులు అల్మారాలో ఉన్న 24 క్యారెట్ల వంద గ్రాముల బంగారు బిస్కెట్‌తో పాటు రూ.1 లక్ష నగదును దొంగిలించినట్లు విచారణలో తేలింది.దొంగిలించిన నగదును ఇద్దరూ పంచుకుని వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేయగా, బంగారు బిస్కెట్‌ను అనంతరం విక్రయించాలనే ఉద్దేశంతో తమ గదిలో దాచిపెట్టారు.బాధితుడి ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం.810/2026గా భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం తెల్లవారుజామున పోలీసులు విల్లాలోని వారి గదిపై దాడి చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 24 క్యారెట్ల వంద గ్రాముల బంగారు బిస్కెట్‌ను యథాతథంగా స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసును కూకట్‌పల్లి డీసీపీ పర్యవేక్షణలో, కేపీహెచ్‌బీ డివిజన్ ఏసీపీ, కేపీహెచ్‌బీ ఎస్‌హెచ్‌ఓ, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్, డీఎస్‌ఐతో పాటు కేపీహెచ్‌బీ క్రైమ్ టీమ్ సమన్వయంతో ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. కేసు ఛేదనలో విశేష కృషి చేసిన పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించి, తగిన రివార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు.

🌐 Select Language:
📰 ePaper