ప్రైవేట్ ఆస్పత్రుల్లో క్షుణ్ణమైన తనిఖీలు ఎప్పుడు?

June 30, 2026 | తెలంగాణ

ప్రైవేట్ హాస్పిటల్ వద్దు.. ప్రభుత్వ హాస్పిటల్ ముద్దు అనే చైతన్యం ఎందుకు తీసుకురావడం లేదు?

జనం న్యూస్ ప్రత్యేక కథనం జనం న్యూస్, జూన్ 30, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : “ప్రైవేట్ స్కూల్ వద్దు.. ప్రభుత్వ స్కూల్ ముద్దు” అనే నినాదం ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లే, “ప్రైవేట్ హాస్పిటల్ వద్దు.. ప్రభుత్వ హాస్పిటల్ ముద్దు” అనే చైతన్యాన్ని కూడా ప్రభుత్వం, వైద్యశాఖ అధికారులు ప్రజల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. “వైద్యో నారాయణో హరి” అని మన పెద్దలు చెప్పిన మాటకు విశిష్టమైన స్థానం ఉంది. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ప్రజలు చేతులెత్తి మొక్కేది వైద్యుడినే. అలాంటి పవిత్రమైన వైద్య వృత్తిలో సేవాభావం తగ్గి, వ్యాపార ధోరణి పెరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొంతమంది ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో రోగులకు అవసరమైన దానికంటే ఎక్కువ పరీక్షలు నిర్వహించడం, ఆసుపత్రిలో చేర్పించడం, భారీ బిల్లులు వసూలు చేయడం వంటి ఆరోపణలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ భారాన్ని మోయలేక ఆర్థికంగా చితికి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబాలకు లక్షల్లో వైద్య ఖర్చులు భరించడం అసాధ్యంగా మారిందని ప్రజలు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ రోగుల ప్రాణాలను కాపాడలేకపోయినా, పూర్తి బిల్లులు చెల్లించిన తర్వాతే మృతదేహాలను అప్పగించిన ఘటనలు గతంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత, పరీక్షల కోసం బయటకు పంపించడం, కొంతమంది సిబ్బంది నిర్లక్ష్య ధోరణి ప్రజల్లో అసంతృప్తికి కారణమవు తున్నాయి.ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలకు సంబంధించిన ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏ వ్యాధికి ఎంత ఫీజు, ఏ ఆపరేషన్‌కు ఎంత ఖర్చు, వైద్యుల అర్హతలు ఏమిటి అనే వివరాలు పారదర్శకంగా ఉండాలని కోరుతున్నారు. స్పెషలిస్ట్ పేరుతో సేవలందిస్తున్న వారందరి అర్హతలను కూడా అధికారులు పరిశీలించాలని అభిప్రాయపడుతున్నారు.వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు పెరిగే సమయంలో కొందరు ఆసుపత్రులు పరిస్థితిని అవకాశంగా మలుచుకుని అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకం పేరుకే ఉండి, అందాల్సిన సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదని కూడా ప్రజలు పేర్కొంటున్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం, తగిన మందులు, ఆధునిక సదుపాయాలు, మెరుగైన సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామాలు, పట్టణాలు, వార్డుల్లో ప్రభుత్వ వైద్య సేవలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలని సూచిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులపై పైపై తనిఖీలకే పరిమితం కాకుండా, క్షుణ్ణమైన తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేసి, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని కోరుతున్నారు.

🌐 Select Language:
📰 ePaper