ఇ20తో కాలుష్యానికి చెక్.. రైతులకు మేలు
,జనం న్యూస్: ఆగస్టు 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ కలపడం ద్వారా దేశ ఇంధన భద్రత బలోపేతం అవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు, రైతుల ఆదాయానికి మేలు జరుగుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2013-14లో 1.5 శాతం కంటే తక్కువగా ఉన్న ఇథనాల్ కలయిక ప్రస్తుతం 20 శాతానికి చేరిందని, ఇ20 ద్వారా ఇప్పటివరకు సుమారు 544 లక్షల మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు 181 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు వినియోగాన్ని ప్రత్యామ్నాయంగా భర్తీ చేయగలిగామని, విదేశీ మారకద్రవ్య ఆదాలో సుమారు 1.06 లక్షల కోట్ల ప్రయోజనం కలిగిందని పేర్కొన్నారు. ఇథనాల్ తయారీకి వ్యవసాయ ఆధారిత ముడి పదార్థాలను వినియోగించడం ద్వారా రైతులకు అదనపు మార్కెట్, ఆదాయ అవకాశాలు లభిస్తున్నాయని, సాంకేతికతలో వస్తున్న మార్పులను ప్రజలు స్వాగతించాలని, ఇ20 ఇంధనం నిర్దేశిత నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు. ఇ20 ఇంధనంపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించిన ఆయన, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకుంటున్న ఇంధన సంస్కరణలను రాజకీయ కోణంలో చూడకుండా వాస్తవాలను అర్థం చేసుకోవాలని సూచించారు. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, రైతుల ప్రయోజనాలను కాపాడుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని, 2047 నాటికి భారత్ ను వికసిత్ భారత్ గా తీర్చిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారావు, జిల్లా కార్యదర్శి మద్దెల లక్ష్మీదేవి, నాయకులు దేవిశెట్టి చంద్ర శేఖర్, మండ్ల శివ ప్రసాద్, బొంతల క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.