ఉచిత టైలరింగ్ శిక్షణ ప్రారంభించిన మంత్రి సుభాష్

సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ
జనం న్యూస్ జూలై 21 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)*రామచంద్రపురం, మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురంలోని ఆర్డిఓ కార్యాలయ ప్రాంగణంలోని స్త్రీ శక్తి భవనంలో ఉచిత టైలరింగ్ శిక్షణా కార్యక్రమాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, డిఆర్డిఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాంబాబు, ఎల్డిఎం కేశవ వర్మ, ఆర్ఎస్ఈటిఐ డైరెక్టర్ రమణ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని, వారికి నైపుణ్యాభివృద్ధి ద్వారా స్థిరమైన ఆదాయ వనరులు కల్పించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ సహకారంతో నిర్వహించే ఈ శిక్షణలో ఆధునిక టైలరింగ్ మెళకువలు, కుట్టు యంత్రాల వినియోగం, దుస్తుల తయారీ విధానాలు, స్వయం ఉపాధి అవకాశాలపై ప్రత్యేక శిక్షణ అందిస్తారని మంత్రి వెల్లడించారు. వృత్తి నైపుణ్య శిక్షణ తీసుకున్న వారికి బ్యాంకు రుణాలు అందించి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తున్నామన్నారు.మహిళల అభివృద్ధి లేకుండా సమాజ అభివృద్ధి సాధ్యం కాదని, మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం, సమాజం బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. యువతులు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించి సమాజంలో తలెత్తుకొని నిలబడేలా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ కృషి చేస్తుందన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఆర్డిఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ డి రాంబాబు మాట్లాడుతూ మహిళల కోసం భవిష్యత్తులో మరిన్ని ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించ నున్నట్లు తెలిపారు. మహిళా సాధికారత లక్ష్యంగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ కృషి చేయడం అభినందనీయమన్నారు. 30 రోజుల శిక్షణానంతరం సర్టిఫికెట్లు మంజూరు చేస్తామన్నారు. అనంతరం మహిళలకు అవసరమైన కిట్లు మంత్రి సుభాష్ చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎల్డిఎం కేశవ వర్మ, ఆర్ఎస్ఈటిఐ డైరెక్టర్ రమణ, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జాస్తి విజయలక్ష్మి, కూటమి పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.