ఎమ్మెల్యే సంజయ్ ఆదేశాలతో పెద్ద చెరువు గండి పూడ్చే పనుల పురోగతి పరిశీలన

August 8, 2026 | తెలంగాణ

జనం న్యూస్, ఆగస్టు 08, జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి: మెట్‌పల్లి పట్టణంలోని పెద్ద చెరువుకు ఇటీవల గండి పడటంతో చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చెరువును పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడారు.చెరువుకు గండి పడటంతో నీరు బయటకు వెళ్లడంతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో గండిని తక్షణమే పూడ్చి, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సంజయ్ అధికారులను ఆదేశించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు స్పందించి వారం రోజుల్లో గండి పూడ్చే పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మెట్‌పల్లి పట్టణ బీఆర్‌ఎస్ నాయకులు శనివారం పెద్ద చెరువును సందర్శించి గండి పూడ్చే పనుల పురోగతిని పరిశీలించారు.ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు చేపట్టిన పనులు, మిగిలిన పనుల వివరాలను పరిశీలించారు. సోమవారం నాటికి గండి పూడ్చే పనులను పూర్తిచేస్తామని అధికారులు బీఆర్‌ఎస్ నాయకులకు వివరించారు.చెరువు గండి కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను మరింత వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు అధికారులను కోరారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ చెరువు గండి పూడ్చే పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు.

🌐 Select Language:
📰 ePaper