తాండూరులో 1260 గ్రాముల గంజాయి స్వాధీనం – ముగ్గురు అరెస్ట్
జనం న్యూస్ 20 ఆగస్టు :- వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS గారి ఆదేశాల మేరకు జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాండూరులోని విలియం మూన్ స్కూల్ గ్రౌండ్ వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా బ్యాగులతో తిరుగుతుండటాన్ని పోలీసులు గమనించారు. అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని వారి బ్యాగులను తనిఖీ చేయగా, వారి వద్ద 1,260 గ్రాముల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై సంబంధిత NDPS Act నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి, అరెస్ట్ అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్కు తరలించారు. ఈ తనిఖీలు జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్ పాషా మరియు వారి బృందం, తాండూర్ టౌన్ ఇన్స్పెక్టర్ పరమేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు మరియు వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.