ప్రాణదాతగా నిలిచిన బ్యాంక్ మేనేజర్ అరుణ్ కుమార్
అత్యవసర సమయంలో ఏబీ పాజిటివ్ రక్తదానం చేసి మహిళకు అండగా నిలిచిన సామాజిక సేవకుడు
జనం న్యూస్, జులై 2, జగిత్యాల జిల్లా మెట్పల్లి: మెట్పల్లి పట్టణంలోని సురక్ష హాస్పిటల్లో చికిత్స పొందుతున్న లక్ష్మి అనే మహిళకు అత్యవసర చికిత్స నిమిత్తం ఏబీ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వారు రక్తదాతల అనుసంధానకర్త ఉదయ్ కుమార్‌ను సంప్రదించారు.సమాచారం అందుకున్న సామాజిక సేవకుడు, ఇంద్రసేన యూత్ సభ్యుడు, వెల్లుల్ల ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ నీరటి అరుణ్ కుమార్ వెంటనే స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారు. విధుల్లో ఉన్నప్పటికీ బ్యాంక్ నుంచి నేరుగా బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లి ఏబీ పాజిటివ్ రక్తాన్ని దానం చేసి బాధిత మహిళకు ప్రాణదాతగా నిలిచారు.అత్యవసర సమయంలో స్పందించి రక్తదానం చేసిన అరుణ్ కుమార్ సేవా భావాన్ని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, సురక్ష హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రమేష్ రెడ్డి, రక్తదాతల అనుసంధానకర్త ఉదయ్ కుమార్, ఇంద్రసేన యూత్ సభ్యులు, పేషెంట్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అభినందించారు. రక్తదానం మహాదానం అని, అవసరమైన సమయంలో ఒక యూనిట్ రక్తం ఎంతో విలువైన ప్రాణాలను కాపాడగలదని వారు పేర్కొన్నారు. సమాజంలో మరింత మంది యువత రక్తదానానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.