ముక్తేశ్వరంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి : నాయకులు
జనం న్యూస్ ఆగస్టు 11 ముమ్మిడివరం ప్రతినిధి దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటిచెప్పే లక్ష్యంతో అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో మంగళవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. మండల హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఇన్చార్జిలు గుర్రాల వీర కృష్ణ, ఆకుల గంగబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముక్తేశ్వరం లోని వైవీఎస్ & బీఆర్ఎం పాలిటెక్నిక్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీని కళాశాల ప్రిన్సిపాల్ కుడుపూడి విశాలాక్షి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను చేతబట్టి దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. పాలిటెక్నిక్ కళాశాల నుంచి ముక్తేశ్వరం సెంటర్ మీదుగా హైస్కూల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా “ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేద్దాం.. దేశభక్తిని చాటుదాం”, “జాతీయ జెండాకు గౌరవం కల్పిద్దాం.. దేశ సమైక్యతను కాపాడుదాం” అంటూ నినాదాలు చేశారు. విద్యార్థుల నినాదాలతో ముక్తేశ్వరం పురవీధులు మార్మోగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యవక్తలుగా రాష్ట్ర నాయకులు అడబాల సత్యనారాయణ, నల్లా పవన్ కుమార్, గనిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కేవలం జాతీయ జెండాను ఎగురవేయడం మాత్రమే కాదని, దేశం పట్ల ప్రతి ఒక్కరిలో గౌరవం, బాధ్యత, దేశభక్తి భావాలను మరింతగా పెంపొందించడమే ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రతి కుటుంబం తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ ఐక్యత, సమగ్రతకు ప్రతీకగా నిలవాలని పిలుపునిచ్చారు.ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేతర్యాలీ అనంతరం ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని ఆర్డీవో జీవీవీ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అయినవిల్లి తహసీల్దార్ విద్యాపతితో కలిసి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ జెండా ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధిలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. అదేవిధంగా ఎంపీడీవో కార్యాలయం వద్ద డిప్యూటీ ఎంపీడీవో వాణీకుమారి బెహర తన సిబ్బందితో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ప్రతి ఇంటా జాతీయ జెండా రెపరెపలాడేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ, సంసు సాదిక్, మోకా ఆదిలక్ష్మి, కుసుమ సునీత, కుడుపూడి చంద్రశేఖర్, సరళ దాసు, కంచర్ల శివరామ్, అల్లవరపు రవి శర్మ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, కళాశాల సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.