రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జనం న్యూస్ అక్టోబరు 8 కోటబొమ్మాళి :టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు మహిళలు, చిన్నారుల సంక్షేమం, భూగర్భ జలాల పరిరక్షణ, పరిపాలనా సౌకర్యాల విస్తరణకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా టెక్కలి మండల కేంద్రంలో గురువారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మొత్తం రూ.3.45 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు శ్రీకారం చుట్టారు.వైకాపా పాలనలో రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి, రికార్డులను తారుమారు చేసి ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేశారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ తన బాధ్యతగా భావిస్తున్నానని, టెక్కలి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.మహిళలు, బాలికల రక్షణ, సంక్షేమం కోసం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రూ. 60 లక్షలతో సఖి వన్‌స్టాప్ సెంటర్ నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. బాధిత మహిళలు, బాలికలకు అవసరమైన సహాయాన్ని ఒకే వేదికపై అందించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు.టెక్కలిలో భూగర్భ జలాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్‌శాఖ ఆధ్వర్యంలో టీటీ రోడ్డు నుంచి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వరకు రూ.85 లక్షలతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. MGNREGS, MPGF, GPGF నిధులను వినియోగించి నీటి వనరుల అభివృద్ధి, భూగర్భ జలాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.ఏపీడీఎస్ ప్రాజెక్టు, టెక్కలి పరిధిలో రూ.కోటి అంచనా వ్యయంతో అంగన్‌వాడీ భవనాన్ని నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. సమీకృత శిశు అభివృద్ధి సేవల (ఐసీడీఎస్) పరిధిలోని ఎం.పీ.జీ.ఎఫ్ నిధులతో చేపట్టనున్న ఈ భవనం ద్వారా చిన్నారులకు మెరుగైన వాతావరణంలో సేవలందించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.బొడ్డేవల్లి గోపాల్ రావు , వంశధా ప్రాజెక్ట్ ఎడమ ప్రధాన కాలువ పంచాయతీ పరిధిలో రూ.కోటితో డివిజన్ కార్యాలయ భవనాన్ని నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. దీంతో స్థానికులకు పరిపాలనా సేవలు మరింత చేరువవుతాయని చెప్పారు. 2029 నాటికి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, అంగన్వాడీ భవనాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో టెక్కలి నియోజకవర్గంలో అభివృద్ధికి తగిన ప్రాధాన్యం దక్కలేదని మంత్రి విమర్శించారు. ఐదేళ్ల పాలనలో అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. వివిధ స్థాయిల్లో నిలిచిపోయిన భవనాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని, త్వరలో నిధులు మంజూరు చేసి పెండింగ్ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, నకిలీ పట్టాలు, అక్రమ రిజిస్ట్రేషన్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివాదాల్లో ఉన్న ప్రభుత్వ భూముల రికార్డులను సమగ్రంగా పరిశీలిస్తున్నామని, అవసరమైతే ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించి అయినా ప్రభుత్వ ఆస్తులను కాపాడుతామని చెప్పారు.ప్రజా అవసరాల కోసం ప్రభుత్వ భూములను వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమైన స్థలాలను కేటాయిస్తున్నట్లు చెప్పారు.అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు, ఇంటి స్థలం అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 3.20 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి పారదర్శకంగా ఇళ్లు, స్థలాలు అందిస్తామని చెప్పారు.టెక్కలి మండల పరిధిలో ఇటీవల జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన నలుగురి కుటుంబ సభ్యులకు మంత్రి అచ్చెన్నాయుడు రూ. 5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జగతమెట్ట వద్ద ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వానికి నెలకు సుమారు రూ. 11 లక్షల ఆదాయం సమకూరుతోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంతో పాటు వాటిని ప్రజా ప్రయోజనాలకు, ఆదాయ వనరులుగా వినియోగిస్తున్నట్లు చెప్పారు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఉపయోగపడేలా పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని,సూచించారు. ప్రజల సహకారంతో టెక్కలి పట్టణాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, పీఎసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, AMC చైర్మన్ శేషగిరిరావు, భాజపా, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.