జనం న్యూస్ అక్టోబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా- గత 23 రోజులుగా సమ్మె చేస్తున్న విఆర్ఏలు కొత్తపేట పాత బస్టాండ్ సెంటర్లో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పాలూరి సత్యానందంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విఆర్ఏలు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో 20 వేల మందికి పైగా విఆర్ఏలు పనిచేస్తున్నారని, 2018లో చంద్రబాబు హయాంలో పెరిగిన 10,500 జీతం తప్ప అప్పటి నుండి ఒక్క రూపాయి కూడా పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల బడుగు, బలహీన వర్గాలకు చెందిన తమకు 10,500 జీతంతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని తెలిపారు. తెలంగాణ తరహాలో రెగ్యులర్ చేసి పే స్కేల్ అమలు చేయాలని, నామినీలను వన్ టైం సెటిల్మెంట్ గా విఆర్ఏలుగా నియమించాలని, 70% ప్రమోషన్లు, మరణించిన విఆర్ఏల కుటుంబాలకు కారుణ్య నియామకం కల్పించాలని కోరారు. రీ సర్వేలు, ఎన్నికల విధులు, భూమి శిస్తులు, కార్యాలయంలో వాచ్‌మెన్ డ్యూటీలు వంటి అదనపు విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పాలూరి సత్యానందం మాట్లాడుతూ విఆర్ఏల సమస్యలను రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ ద్వారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కోటిపల్లి దామోదర్, విఆర్ఏలు పాల్గొన్నారు.