ఆంధ్రప్రదేశ్

డి-వన్ కాలువ నిర్మాణాన్ని నిలిపివేయాలి

డి-వన్ కాలువ నిర్మాణాన్ని నిలిపివేయాలి

17 ఏళ్ల క్రితమే హైకోర్టును ఆశ్రయించిన రైతులు.. మళ్లీ భూసేకరణకు అధికారుల ప్రయత్నం సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు.. తహసీల్దార్‌కు వినతిపత్రం జనం న్యూస్, అక్టోబర్ 8, జగిత్యాల జిల్లా : కొడిమ్యాల కొడిమ్యాల మండలంలో డి-వన్ కాలువ నిర్మాణ ప్రతిపాదనపై రైతుల నుంచి మరోసారి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సుమారు 17 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు మైసమ్మ చెరువు నుంచి గోపాల్రావుపేట చెరువును అనుసంధానం చేసేందుకు 33 అడుగుల వెడల్పుతో కాలువ నిర్మాణానికి అలైన్‌మెంట్ రూపొందించినట్లు రైతులు తెలిపారు. ఈ కాలువ కొడిమ్యాల, చెప్యాల, అప్పారావుపేట, రామకృష్ణాపురం, కొండాపురం గ్రామాల శివారుల మీదుగా నిర్మించేందుకు ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. అయితే కాలువ నిర్మాణం కోసం తమ విలువైన వ్యవసాయ భూములను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయా గ్రామాలకు చెందిన పలువురు రైతులు అప్పట్లో గౌరవ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని, వారి ఆక్షేపణలను గుర్తించాలని, రైతులను విస్మరించి ముందుకు వెళ్లరాదని అప్పటి న్యాయస్థాన తీర్పులో స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని రైతులు పేర్కొన్నారు. మళ్లీ తెరపైకి డి-వన్ కాలువ అంశం ఇటీవల కాలువ నిర్మాణానికి సంబంధించి అధికారులు మరోసారి చర్యలు చేపట్టడంతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. గత నెలలో ప్రిలిమినరీ ప్రక్రియలో భాగంగా సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు నామమాత్రపు నోటీసులు ఇచ్చి, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో గ్రామాల్లో సమావేశాలు నిర్వహించినట్లు రైతులు తెలిపారు. ఈ సమావేశాల్లో పలు గ్రామాలకు చెందిన రైతులు తమ అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలను కూడా అధికారులకు అందజేసినట్లు చెప్పారు. సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు ఈ నెల 7వ తేదీన రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు కలిసి కాలువ నిర్మాణానికి సంబంధించి సర్వే నిర్వహించేందుకు గ్రామాలకు రావడంతో రైతులు, గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా సర్వే నిర్వహించేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధికారులు ఏదైనా దరఖాస్తు రూపంలో అభ్యంతరాలను అందజేస్తే సర్వే చేయకుండా వెనుదిరుగుతామని చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో కాలువ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ రైతులు, గ్రామస్తులు దరఖాస్తు సిద్ధం చేసి అధికారులకు అందజేయడానికి ప్రయత్నించారు. అయితే అధికారులు ఆ దరఖాస్తులను స్వీకరించకుండా వెనుదిరిగారని గ్రామస్తులు ఆరోపించారు. తహసీల్దార్‌కు వినతిపత్రం దీంతో ఆయా గ్రామాలకు చెందిన రైతులు, గ్రామస్తులు కొడిమ్యాల తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి, డి-వన్ కాలువ నిర్మాణ ప్రక్రియను నిలిపివేయాలని కోరారు.

కాలువ నిర్మాణం జరిగితే తమ విలువైన వ్యవసాయ భూములను కోల్పోయి జీవనాధారాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాలకు భూములే ప్రధాన ఆధారమని తెలిపారు.

కాలువ నిర్మాణం వల్ల రైతులకు భూములు కోల్పోవడం తప్ప తమకు కలిగే ప్రయోజనం ఏమిటో అధికారులు స్పష్టంగా తెలియజేయాలని రైతులు కోరుతున్నారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని, తమ అభ్యంతరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఇ-పేపర్