విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పనకు బసంతి ఫౌండేషన్ సహకారం
జనం న్యూస్ అక్టోబర్ 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ చొరవ తీసుకున్నారు.కూకట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటయ్య కళాశాలలో సీలింగ్ ఫ్యాన్లు, ఫర్నిచర్ కొరతతో పాటు పాత భవనం కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బండి రమేష్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు బసంతి ఫౌండేషన్ చైర్మన్ అజయ్ తో మాట్లాడి, కళాశాలకు సీలింగ్ ఫ్యాన్లు, ఫర్నిచర్‌తో పాటు విద్యార్థుల కోసం 1,500 గ్లాస్ వాటర్ బాటిళ్లు అందించేలా చొరవ తీసుకున్నారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, తన విజ్ఞప్తికి వెంటనే స్పందించి విద్యార్థుల అవసరాలకు సహకారం అందించిన బసంతి ఫౌండేషన్ చైర్మన్ అజయ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా మరింత మంది విద్యార్థులకు అండగా నిలవాలని ఆకాంక్షించారు.కూకట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం పాతదై శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కళాశాలలో ప్రవేశాల కోసం వేలాది మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నప్పటికీ, ప్రస్తుతం సుమారు 1,500 మంది విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు కల్పించే పరిస్థితి ఉందని ప్రిన్సిపాల్ వెంకటయ్య తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం, విద్యాసంస్థలను బలోపేతం చేయడం, మరింత మంది విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించడం లక్ష్యంగా కళాశాల స్థల సమస్యను ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని బండి రమేష్ తెలిపారు. నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు, ప్రభుత్వ సహకారంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారం తీసుకునే అవకాశాలపై కూడా కృషి చేస్తానని పేర్కొన్నారు.విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే పునాది అని పేర్కొన్న బండి రమేష్ ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్లు, సిబ్బంది, విద్యార్థులతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు తూము వేణు, చున్ను పాషా, సప్పిడి భాస్కర్, తూము సంతోష్, శంకర్, రఘు, పుష్పారెడ్డి, జ్యోతి, సోను, రమణ, నళినీకాంత్, వాసు, హుస్సేన్, బాలరాజు, అక్బర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.