జనం న్యూస్ అక్టోబర్ 27: ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేనికోన మండలం గచ్చకాయలపొర గ్రామంలో డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా క్షేత్రస్థాయిలో పర్యటించారు. తాటాకు గుడిసెల్లో నివసిస్తున్న ప్రజలకు ఆర్నాబ్ తుఫాన్ ప్రభావం, తీవ్రతను వివరించి ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా స్వచ్ఛందంగా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. తీర ప్రాంత ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి పూరి గుడిసెల్లోని కుటుంబాలను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. అనంతరం గచ్చకాయలపొర పునరావాస కేంద్రాన్ని సందర్శించి తాగునీరు, ఆహారం, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల ప్రజలను పాఠశాలలు, ప్రభుత్వ భవనాలకు తరలించాలని సూచించారు. సమాచారాన్ని మనమిత్ర, అవేర్ యాప్ల ద్వారా ప్రజలకు చేరవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి జి. మమ్మీ, డ్రైన్స్ డీఈ శ్రీనివాస్, ఎంపీడీవో బి. రాజేశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీవోలు నున్న శంకర్ నారాయణ, సూర్యనారాయణ రాజు, తహసిల్దార్ రవికిరణ్, వైద్యాధికారులు ఎం. లిఖిత, పి. నీలిమ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.