ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల కోసం ముందుకొచ్చిన పూర్వ విద్యార్థి

విద్యార్థుల కోసం ముందుకొచ్చిన పూర్వ విద్యార్థి

తాళ్ల రాంపూర్ పాఠశాలకు రూ. 38 వేల విలువైన 100 టీషర్టుల వితరణ జనం న్యూస్ నవంబర్ 06: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం లోని తాళ్ల రాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశంలో విద్యార్థుల విద్యాభివృద్ధి, తల్లిదండ్రుల బాధ్యతలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఉపాధ్యాయులు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా తపస్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు, ఉపాధ్యాయులు కిషన్ రెడ్డి గారి పూర్వ విద్యార్థి అయిన బాచన్‌పల్లికి చెందిన శెట్టి సతీష్, వారి విజ్ఞప్తి మేరకు తాళ్ల రాంపూర్ పాఠశాలకు సుమారు రూ.38 వేల విలువైన 100 టీషర్టులను అందజేశారు. ఈ సందర్భంగా తాళ్ల రాంపూర్ ఇన్‌చార్జి సర్పంచ్ చాట్ల జనార్దన్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు దాతలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని అన్నారు. విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. శెట్టి సతీష్ అందించిన సహాయం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఆయనకు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు నాంపల్లి శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు శెట్టి సతీష్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇ-పేపర్