ఆంధ్రప్రదేశ్

ఏర్గట్ల మండలంలో పాఠశాలల అభివృద్ధికి రూ.67.75 లక్షలు మంజూరు

ఏర్గట్ల మండలంలో పాఠశాలల అభివృద్ధికి రూ.67.75 లక్షలు మంజూరు

ఏడు పాఠశాలల్లో ప్రహరీ గోడలు, అదనపు గది నిర్మాణానికి నిధులు జనం న్యూస్ నవంబర్ 6, నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వికసిత్ భారత్ – గ్రామీణ ఉపాధి మరియు జీవనోపాధి హామీ మిషన్ పథకం కింద రూ. 67.75 లక్షల నిధులుమంజూరైనట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్ తెలిపారు. ఈ నిధులతో మండలంలోని ఏడు పాఠశాలల్లో ప్రహరీ గోడలు, ఒక అదనపు గది నిర్మించనున్నట్లు వెల్లడించారు. మంజూరైన నిధుల వివరాలు: ఏర్గట్ల కేజీబీవీ పాఠశాల ప్రహరీ గోడకు రూ. 10 లక్షలు. ఏర్గట్ల ఎంపీపీఎస్ అందరుతోట పాఠశాలకు రూ. 10 లక్షలు. తడపాకల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రహరీ గోడకు రూ. 10 లక్షలు. తడపాకల్ జడ్పీహెచ్ఎస్ అదనపు గది నిర్మాణానికి రూ. 15 లక్షలు. దొంచంద ఎంపీయూపీఎస్ పాఠశాల ప్రహరీ గోడకు రూ. 10 లక్షలు. గుమ్మిర్యాల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రహరీ గోడకు రూ. 7.50 లక్షలు. ఏర్గట్ల ఎంపీపీఎస్ ఎస్సీ కాలనీ పాఠశాల ప్రహరీ గోడకు రూ.5.25 లక్షలు. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు సమకూర్చనున్నాయి. ఈ సందర్భంగా శివన్నోల్ల శివకుమార్ మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క దృష్టికి మండలంలోని పాఠశాలల సమస్యలను తీసుకెళ్లినట్లు తెలిపారు. పాఠశాలలకు నిధులు మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మండలంలోని గ్రామాల్లో వ్యవసాయ భూములకు మెటల్ రోడ్లు, అంగన్‌వాడీ భవనాలు, ప్రహరీ గోడలు, ఐకేపీ మహిళా సంఘాల భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, వాటికి అవసరమైన అదనపు నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్కను కోరినట్లు తెలిపారు. అలాగే రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తడపాకల్, గుమ్మిర్యాల్, దొంచంద గ్రామాల్లో అదనపు పుష్కర ఘాట్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంలో సహకరించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కకు, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్‌కు మండల ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌడ భూమేష్, కొర్రుపల్లి లింగారెడ్డి, దేశబోయిన సంజీవ్, జింక అనిల్, సున్నపు శ్రీను, ఆశిరెడ్డి హన్మంత్ రెడ్డి, గడ్డం జీవన్, జాకీర్, బద్దం లింగారెడ్డి, ముస్కు మోహన్, లోలపు రాజు, పన్నాల నర్సారెడ్డి, దండేవోయిన సాయన్న, బద్దం ఇంద్ర, ఎర్రాజి హరీశ్, కంచరి రవి, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

ఇ-పేపర్