జనం న్యూస్ 17 నవంబర్ 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయక పరికరాలు అందేలా ప్రత్యేక ఏర్పాట్లు – మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఎస్ ఎం ఆర్ గార్డెన్స్‌లో అలింకో సంస్థ సహకారంతో దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచిత సహాయక ఉపకరణాలు అందించేందుకు ఏర్పాటు చేసిన నిర్ధారణ వైద్య శిబిరాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, జడ్పీ సీఈఓ శేషాద్రి, పీడీ డీఆర్డీఓ శ్రీను, జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, అలింకో సంస్థ ప్రతినిధులు, జిల్లా అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దివ్యాంగులు, వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. శిబిరంలో ఏర్పాటు చేసిన వివిధ వైద్య పరీక్షల కేంద్రాలను పరిశీలించి, లబ్ధిదారులకు దగ్గరుండి పరీక్షలు చేయించారు. ప్రతి ఒక్కరినీ ఓపికగా పరీక్షించి, వారికి అవసరమైన ఉపకరణాలను గుర్తించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు, మున్సిపాలిటీలో ఉన్న దివ్యాంగులు, వయోవృద్ధులకు అవసరమైన సహాయక పరికరాలను ఉచితంగా అందించేందుకు అలింకో సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఎల్కతుర్తి మండలంలో ఈరోజు శిబిరాన్ని ప్రారంభించామని, రేపు 18వ తేదీన భీమదేవరపల్లి, 20వ తేదీన కోహెడ, 21వ తేదీన చిగురుమామిడి మండలాల్లో శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే 25, 26, 27 తేదీల్లో హుస్నాబాద్ మండలం, పట్టణంలో శిబిరాలు నిర్వహించి, అనంతరం అక్కన్నపేట మండలంలో కూడా శిబిరం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ శిబిరాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి అర్హతను బట్టి కృత్రిమ కాళ్లు, చేతులు, వినికిడి యంత్రాలు, చంక కర్రలు, చేతి కర్రలు, వీల్చైర్లు, మూడు చక్రాల వాహనాలు తదితర సహాయక ఉపకరణాలను ఉచితంగా అందజేస్తామని చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 100 శాతం అర్హులైన దివ్యాంగులు, వృద్ధులందరికీ సహాయక ఉపకరణాలు అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని మంత్రి స్పష్టం చేశారు. అర్హులైన వారిని గ్రామాల నుంచి శిబిరాలకు తీసుకువచ్చి, వైద్య పరీక్షల అనంతరం తిరిగి గ్రామాలకు చేర్చే బాధ్యతను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే అర్హులైన వారికి ఏడు రకాల పెన్షన్లు మంజూరు చేశామని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దివ్యాంగులు, వయోవృద్ధులకు సేవ చేసే అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నామని, వారి ఇబ్బందులను తొలగించి ఆత్మగౌరవంతో, స్వతంత్రంగా జీవించేందుకు అవసరమైన సహకారం అందించడమే తమ ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అవసరమైన సహాయక ఉపకరణాలు అందేలా కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. జిల్లా కలెక్టర్ చాహత్ భాజపేయి మాట్లాడుతూ అలింకో శిబిరంలో దివ్యాంగులు, వయోవృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారి అవసరాలకు అనుగుణంగా ఎలాంటి సహాయక ఉపకరణాలు అవసరమో గుర్తించడం జరుగుతోంది.ఈ పరీక్షల ఆధారంగా లబ్ధిదారులకు అవసరమైన ఉపకరణాలను ఎంపిక చేసి, వారి రోజువారీ జీవితంలో ఇబ్బందులు తగ్గించి, మరింత సౌకర్యవంతంగా జీవించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.వైద్య పరీక్షల్లో గుర్తించిన సహాయక పరికరాలు రాబోయే ఒకటి నుంచి రెండు నెలల్లో అందుబాటులోకి వస్తాయి. అనంతరం వాటిని గ్రామాల్లో లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుంది.ఈరోజు అంగన్వాడీ టీచర్ల సహకారంతో దాదాపు అర్హులైన వారందరినీ సమీకరించి శిబిరానికి తీసుకురావడం జరిగింది. ఏవైనా కారణాలతో ఇప్పటివరకు శిబిరానికి హాజరుకాలేకపోయిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చివరి విడతగా ఈ నెల 22, 23 తేదీల్లో హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది.ఇప్పటివరకు హాజరుకాని అర్హులైన దివ్యాంగులు, వృద్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని హుస్నాబాద్‌లో జరిగే శిబిరానికి హాజరై వైద్య పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి.