కాంగ్రెస్ ముట్టడి పిలుపుతో ఎమ్మెల్యే ఇంటి వద్దకు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం. పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు జనం న్యూస్, నవంబర్ 17,| జగిత్యాల జిల్లా : మెట్పల్లి మెట్పల్లి పట్టణంలో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నాయకులు పిలుపునివ్వడంతో ఎమ్మెల్యే నివాసం వద్ద ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ నాయకుల ముట్టడి పిలుపు నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకునేది లేదని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించారు. దీంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒక్కసారిగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి మెట్పల్లి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలను సముదాయిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే తన నివాసంలోని పనుల కోసం మున్సిపల్ కార్మికులను వినియోగించుకుంటున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే నివాస ముట్టడికి పిలుపునివ్వడం, దీనికి ప్రతిగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో రెండు పార్టీల మధ్య వివాదం మరింత ముదిరింది. ప్రస్తుతం ఎమ్మెల్యే నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో మెట్పల్లి పట్టణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. పోలీసులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నారు.