ఆంధ్రప్రదేశ్

వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ధ్వంసంపై విశ్వబ్రాహ్మణ సంఘాల ఆగ్రహం

వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ధ్వంసంపై విశ్వబ్రాహ్మణ సంఘాల ఆగ్రహం

నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి ధ్వంసమైన స్థలంలోనే స్వామివారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలి జనం న్యూస్ ఏర్గట్ల నవంబర్ 17:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం : మెదక్ జిల్లా నర్సాపూర్ వద్ద శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటనను విశ్వబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏర్గట్ల మండలానికి చెందిన విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సమాజ ప్రతినిధులు, హిందూ సమాజ పెద్దలుమంగళవారం మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్ఓ)కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించే శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత బాధాకరమని, ఈ ఘటన యావత్ భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన నిందితులను పోలీసు అధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టి, సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలను పరిశీలించి త్వరితగతిన గుర్తించాలని కోరారు. నిందితులను అరెస్ట్ చేసి సంబంధిత చట్టాల ప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ధ్వంసమైన అదే ప్రదేశంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి నూతన విగ్రహాన్ని ప్రభుత్వ, స్థానిక అధికారుల సహకారంతో పూర్తి గౌరవప్రదంగా పునఃప్రతిష్ఠించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయాలు, ధార్మిక ప్రదేశాల వద్ద తగిన భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపట్టాలని ఎంఆర్ఓను కోరారు. ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేసిన వారిలో ఏర్గట్ల విశ్వబ్రాహ్మణ మండల అధ్యక్షుడు వట్ల గంగాధర్, విశ్వబ్రాహ్మణ ఐక్యసంఘం అధ్యక్షుడు రాజనర్సయ్య, విశ్వబ్రహ్మ సంఘం అధ్యక్షుడు చంద్రయ్య, దుంతల గంగమోహన్, సజ్జనపు రవి, సావతి అనిల్, రాజారపు నరేష్, రాజారపు నరేందర్, గుండోజి శ్రీనివాస్, అక్కనూరు వాసు, అక్కనూరు చిట్టి, పరికిపండ్ల నరేష్ తదితరులు ఉన్నారు.

ఇ-పేపర్