ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై సత్వర స్పందన – ఆల్విన్ కాలనీ డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి జనం న్యూస్ – నవంబర్ 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి స్పష్టం చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, అందిన ఫిర్యాదులపై సత్వరమే స్పందించి పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు. రోడ్లు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, చెత్త సేకరణతో పాటు ఇతర మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇందుకోసం MyCURE యాప్, ఎక్స్ (ట్విట్టర్), సర్కిల్కా ర్యాలయంలోని ఇన్వార్డ్ విభాగం ద్వారా ఫిర్యాదులు అందజేయవచ్చని సూచించారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను నేరుగా తెలియజేయవచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రజలకు మరింత చేరువయ్యే లక్ష్యంతో ఈ నెల చివరి నుంచి ప్రతిరోజూ ఒక వార్డులో పర్యటించే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ పర్యటనల్లో స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమతులు లేని నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టే భవన నిర్మాణాలు, రహదారులు, ప్రభుత్వ మరియు ప్రజా స్థలాల ఆక్రమణలపై వచ్చే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడం, సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేయడం తమ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి పేర్కొన్నారు. ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీ అభివృద్ధికి ప్రజల సహకారంతో నిరంతరం కృషి చేస్తామని ఆమె తెలిపారు.