బాలాజీ నగర్‌లో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బండి రమేష్ పాదయాత్ర

June 6, 2026 | తెలంగాణ

జనం న్యూస్ మే 6 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ డివిజన్ పరిధిలో కాలనీవాసులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలపై కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ విస్తృత పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ నగర్ కాలనీవాసులు బండి రమేష్ కి శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేస్తూ ఘన స్వాగతం పలికారు. పాద యాత్రలో భాగంగా ప్రతి గల్లీ, ప్రతి వీధిని సందర్శించిన బండి రమేష్ కి కాలనీవాసులు, పెద్దలు, అసోసియేషన్ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున తమ సమస్యలను వివరించారు.ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన బండి రమేష్ ప్రతి గల్లీలో ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, “గత పదేళ్లుగా గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో భారీగా ఖర్చు చేశామని చెప్పుకుంటోంది. అయితే ఇంకా కాలనీల్లో ఇన్ని సమస్యలు ఉండటానికి కారణమేంటి?” అని ప్రశ్నించారు.కాలనీలో నెలకొన్న డ్రైనేజ్ సమస్యలు, రోడ్ల దుస్థితిపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రస్తుతం అపోలో ఫార్మసీ ఎదురుగా ఉన్న రోడ్డును ఆరవై అడుగులకు విస్తరించడం, అలాగే మధ్యలో డివైడర్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ అంశాలపై బండి రమేష్ మాట్లాడుతూ, సమస్యలను సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి ప్రజలందరికీ అనుకూలంగా ఉండే విధంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే కాలనీలోని డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు చేపడతామని, రోడ్ల అభివృద్ధికి అవసరమైన పనులను త్వరలో ప్రారంభించేలా కృషి చేస్తామని తెలిపారు. అపోలో ఫార్మసీ ఎదురుగా ఉన్న రోడ్డును ప్రభుత్వం ఇప్పటికే నలబై అడుగుల రహదారిగా మంజూరు చేసిందని, ఇందుకు సుమారు రూ.ఒక కోటి నిధులను కూడా కేటాయించినట్లు తెలిపారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సంబంధిత అధికారులతో చర్చించి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని, అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. చిన్నచిన్న సమస్యలను వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.“నేను మళ్లీ పాదయాత్రకు వచ్చే సమయానికి బాలాజీ నగర్‌లో ఒక్క సమస్య కూడా మిగలకుండా చూడాలి” అని అధికారులకు, ప్రజలకు సూచించారు.ఈ పాదయాత్రలో కాలనీవాసులు, పెద్దలు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్ర విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ బండి రమేష్ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper