ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దందాపై చిట్టెంపల్లి బాలరాజ్ ఆగ్రహం

June 8, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జూన్ 08. 06. 2027సంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను వివిధ పేర్లతో భారీగా ఫీజులు వసూలు చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపడం దారుణమని ఆయన విమర్శించారు.ప్రవేశ రుసుములు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంలు, రవాణా ఛార్జీలు తదితర పేర్లతో అధిక మొత్తంలో వసూళ్లు జరుగుతున్నాయని, సామాన్య మరియు మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా కొంతమంది ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తు పేరుతో తల్లిదండ్రులను ఒత్తిడికి గురిచేస్తూ ఫీజుల వసూళ్లు కొనసాగించడం అన్యాయమని, దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే ప్రత్యేక దృష్టి సారించాలని బాలరాజ్ డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు చేపట్టాలని కోరారు.ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని విచారణ జరపాలని, విద్యను వ్యాపారంగా మార్చిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అవసరమైతే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ పాఠశాలలను మూసివేయాలని కూడా చిట్టెంపల్లి బాలరాజ్ డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలని, విద్యారంగంలో పారదర్శకతను తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

🌐 Select Language:
📰 ePaper