మిర్యాలగూడలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు మౌలిక వసతుల కల్పనపై ఎమ్మెల్యే జీఎల్ఆర్‌కు మాల మహానాడు కృతజ్ఞతలు
జనం న్యూస్ జూన్ 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; మిర్యాలగూడ నియోజకవర్గంలోని రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ గృహాలను గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో డ్రాల ద్వారా ఎంపిక చేసినప్పటికీ, లబ్ధిదారులకు అందజేయకుండా, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించకుండానే అధికారాన్ని కోల్పోయిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాజీవ్ స్వగృహ పథకం కింద కేటాయించిన స్థలంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ గృహాల వద్ద సుమారు రూ.ఎడు కోట్ల వ్యయంతో విద్యుత్ సదుపాయం, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మొక్కల నాటకం, ఇండ్లలో నల్లాల ఏర్పాటు, విద్యుత్ కనెక్షన్లు తదితర మౌలిక సదుపాయాలను కల్పించడంతో పేద ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు జీఎల్ఆర్‌కు మాల మహానాడు తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.అలాగే త్వరలో పంపిణీ చేయనున్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగులు, అగ్రవర్ణాలకు చెందిన నిజమైన పేద కుటుంబాలకు మాత్రమే కేటాయించాలని తాళ్లపల్లి రవి కోరారు. గతంలో ఇప్పటికే ఇండ్లు కలిగిన కొందరికి కూడా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించారనే ఆరోపణల నేపథ్యంలో, అధికారులతో నిష్పక్షపాత విచారణ నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా ఇండ్లను అందించాలని ఎమ్మెల్యే జీఎల్ఆర్‌ను విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా స్పందించిన ఎమ్మెల్యే జీఎల్ఆర్, ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తోందని, నిజమైన పేద ప్రజలకే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో బెజ్జం సాయి సర్పంచ్, చిలుకూరి అభినవ్ తదితరులు పాల్గొన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించేందుకు కృషి కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు.