ప్రజా సమస్యల పరిష్కారానికి బిజెపి జనతా వారధి కార్యక్రమం

June 22, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూన్ 22: (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే బీజేపీ చేపట్టిన “జనతా వారధి” కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి వివిధ సమస్యలను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లాలో మరియు రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రత వ్యవస్థను బలోపేతం చేయడం, కల్తీ ఆహార నియంత్రణ, మాంసం దుకాణాల పర్యవేక్షణ, ఫుడ్ టెస్టింగ్ మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజారోగ్య పరిరక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ జిల్లా యంత్రాంగానికి వినతిపత్రం సమర్పించారు.జిల్లా ఆఫీస్ ఇన్‌చార్జ్, కో-కన్వీనర్ డి.వి.ఎస్. రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) “మీ కోసం” వేదిక ఇన్‌చార్జ్ వి. సుబ్బారావుకు ఆహార భద్రత వ్యవస్థ బలోపేతంపై మీ కోసం జిల్లా కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ లైసెన్స్ లేని మాంసం దుకాణాలు, అక్రమ వధశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని, పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు తదితర సామూహిక భోజన కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని కోరారు. అలాగే ప్రజల ఫిర్యాదుల స్వీకరణకు హెల్ప్‌లైన్, ఆన్‌లైన్ ఫిర్యాదు వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు.ముఖ్యంగా అంబేద్కర్ కొనసీమ జిల్లాలో పంట కాలువల పక్కన ఉన్న మాంసం దుకాణాలు, హోటళ్ల నుంచి వచ్చే వ్యర్థాలను కాలువల్లో వేయడం వల్ల నీరు కలుషితమవుతోందని, దీంతో ప్రజలు వివిధ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకుని కాలుష్య నియంత్రణకు కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.అంబేద్కర్ కొనసీమ జిల్లాకు ప్రత్యేక ఆహార భద్రత అమలు ప్రణాళిక రూపొందించి, తరచూ తనిఖీలు నిర్వహించి వాటి నివేదికలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రజారోగ్యం, ప్రజా సంక్షేమం మరియు భావితరాల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిగణించాలని జిల్లా యంత్రాంగాన్ని అభ్యర్థించారు.కార్యక్రమంలో అమలాపురం టౌన్ అధ్యక్షుడు అయ్యల భాస్కరరావు, అమలాపురం రూరల్ మండల అధ్యక్షుడు బోంతు శివాజీ, అల్లవరం మండల అధ్యక్షుడు కట్ట నారాయణ, మామిడికుదురు మండల అధ్యక్షుడు బైరిశెట్టి దుర్గారామకృష్ణ తమ ప్రాంతాల్లోని ప్రజా సమస్యలను “మీ కోసం” వేదిక ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పోనుగుపాటి శ్రీనివాస్, అమలాపురం మండల మాజీ అధ్యక్షుడు ఆరిగెల తేజ వెంకట్, పావులూరి వెంకట్,, గూడల పుల్లంశెట్టి, దాకే వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper