మహిళల భద్రత, సాధికారతకు దిశ ఫౌండేషన్ సేవలు అభినందనీయం : జువ్వాడి నర్సింగ్ రావు
జిల్లా కమిటీ పరిచయ కార్యక్రమంలో పాల్గొని నూతన అధ్యక్షురాలు శ్రీదేవికి శుభాకాంక్షలు
జనం న్యూస్, జూన్ 30, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : మహిళల రక్షణ, భద్రత, సాధికారతతో పాటు వారి హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగిత్యాల జిల్లా కమిటీ పరిచయ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలిగా నియమితులైన శ్రీదేవిని అభినందించిన జువ్వాడి నర్సింగ్ రావు, మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ, సామాజిక చైతన్యం, మహిళా సాధికారత కోసం సంస్థ చేపట్టే కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. సమాజంలో మహిళలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రతినిధుల సేవలను ఆయన ప్రశంసించారు.మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు ఇలాంటి సంస్థలు మరింత చైతన్యవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళల సమస్యల పరిష్కారం, అవగాహన కార్యక్రమాలు, చట్టపరమైన సహాయం అందించడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.