చల్‌గల్‌లో కేవీకి 5 ఎకరాల కేటాయింపు బీజేపీ పోరాట ఫలితమే: డా. భోగ శ్రావణి

July 10, 2026 | తెలంగాణ

జనం న్యూస్, జులై 10, జగిత్యాల జిల్లా : జిల్లా కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు చల్‌గల్ వాలంటరీ సెంటర్‌లో 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.158ను బీజేపీ స్వాగతిస్తున్నట్లు జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి డా. భోగ శ్రావణి తెలిపారు.శుక్రవారం కమల నిలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం బీజేపీ చేపట్టిన పోరాటానికి ఈ నిర్ణయం ఫలితమని పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు చల్‌గల్ వాలంటరీ సెంటర్ ప్రాంతమే అనుకూలమని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అధికారులు గుర్తించారని తెలిపారు.ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కారణంగానే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటులో ఏడాది ఆలస్యం జరిగిందని ఆరోపించారు. తనకు అనుకూలంగా ఇతర ప్రాంతాలను ప్రతిపాదించగా, వాటిని అధికారులు తిరస్కరించారని పేర్కొన్నారు. చల్‌గల్‌లోనే కేవీ ఏర్పాటు చేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకోవడం, బీజేపీ మహిళా నాయకులను అరెస్ట్ చేయడం వంటి ఘటనలను ఆమె ప్రస్తావించారు.చివరకు బీజేపీ నాయకుల పోరాటంతో విద్యార్థుల ప్రయోజనాలే గెలిచాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం 5 ఎకరాల భూమిని కేటాయించడం స్వాగతించదగ్గ నిర్ణయమే అయినప్పటికీ, పూర్తి స్థాయి కేంద్రీయ విద్యాలయానికి 10 ఎకరాల స్థలం అవసరమని అన్నారు. క్రీడా మైదానం, ఇతర మౌలిక వసతుల కోసం మరో 5 ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ, ఈ అంశంపై బీజేపీ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.జూలై 12న ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో కేంద్రీయ విద్యాలయం భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కేంద్రీయ విద్యాలయం మంజూరుకు కృషి చేసిన ఎంపీ అరవింద్‌తో పాటు, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భూమి కేటాయింపుకు సహకరించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌కు పార్టీ నాయకులు ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదరి అశోక్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, 42వ వార్డ్ కౌన్సిలర్ నిమ్మల నాగరాజు, జిల్లా కార్యదర్శులు పాత రమేష్, ముత్యంరెడ్డి, కాశెట్టి తిరుపతి, పూదరి శ్రీనివాస్, బద్దెల గంగరాజం తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper