డాక్టర్ రఘు వ్యాఖ్యలు అనుచితం.. ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్య

July 20, 2026 | తెలంగాణ

జనం న్యూస్, జూలై 20, జగిత్యాల జిల్లా, మెట్టుపల్లి : కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పై షుగర్ ఫ్యాక్టరీ అంశంలో డాక్టర్ రఘు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కావేరి గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ రఘు చేసిన ఆరోపణలు వాస్తవమని నిరూపిస్తే, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.డాక్టర్ రఘును ఉద్దేశించి మాట్లాడుతూ, “ఎంబీబీఎస్ కోర్సు పూర్తి కావడానికి సాధారణంగా ఐదున్నర సంవత్సరాలు పడుతుంది. కానీ రఘు 12 సంవత్సరాలు చదివారు. వారికి చదువు పూర్తవ్వడానికి ఎంత సమయం పట్టిందో, రాజకీయాలు చేయడానికి కూడా అంతే సమయం పడుతున్నట్టుంది” అని వ్యాఖ్యానించారు.ప్రజాసేవలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గత 20 సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించడం, కరోనా బాధితులను పరామర్శించడం, వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించడం వంటి సేవలను గుర్తు చేశారు.అదేవిధంగా ఉచిత క్యాన్సర్ ఆరోగ్య శిబిరాలు, వివిధ వైద్య శిబిరాల ద్వారా వేలాది మందికి వైద్య సేవలు అందించడంతో పాటు, నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేశారని పేర్కొన్నారు.ప్రజాసేవ అంటే మాటలు కాదు, చేతలని నిరూపిస్తూ మెట్‌పల్లి గ్రంథాలయంలో ప్రతిరోజూ చదువుకునే విద్యార్థులకు పూర్తిగా ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారని తెలిపారు. దీనిపై ఎవరికైనా సందేహం ఉంటే గ్రంథాలయాన్ని సందర్శించి వాస్తవాలు తెలుసుకోవాలని సవాల్ విసిరారు. విద్యార్థులు ఆకలితో చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ సేవను నిరంతరం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.అలాగే ఎమ్మెల్యే సంజయ్ విద్యార్థులను టీ-హబ్, టీ-వర్క్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు తీసుకెళ్లి ఆధునిక సాంకేతికత, స్టార్టప్‌లపై అవగాహన కల్పిస్తూ వారి భవిష్యత్తుకు దోహదపడుతున్నారని తెలిపారు.ఆధారాలు లేని ఆరోపణలు చేయడం మానుకోవాలని, ప్రజలు వాస్తవాలను గుర్తించి అభివృద్ధి, ప్రజాసేవ ఆధారంగా తీర్పు ఇస్తారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.

🌐 Select Language:
📰 ePaper