వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీడీ ఓ& తాసిల్దారి సిబ్బందితో క్షేత్ర పర్యటన
జనం న్యూస్ ఆగస్టు ఒకటి ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ) వరదల తీవ్రత దృష్ట్యా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల పరిధిలోని కుండలేశ్వరం గ్రామ పంచాయతీ వృద్ధ గౌతమీ ఘాట్, నడవపల్లి గ్రామ పంచాయతీ పల్లిపాలెం గ్రామాలను ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు & క్షేత్ర స్థాయి సిబ్బందితో కలిసి శుక్రవారం సందర్శించారు. వరద నీటి ప్రవాహం, ముంపు ప్రాంతాలను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అలసత్వం వద్దని సూచించారు. వరద నీరు ఇళ్లలోకి చేరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్నవారు అవసరమైతే సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కోరారు. గ్రామాల్లో పారిశుధ్యం, త్రాగునీరు, విద్యుత్, రాకపోకలు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలను ఆదేశించారు. వరదల కారణంగా ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని, ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి సహాయ చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాలను తాసిల్దార్ రవి కిరణ్ పరిశీలించారు. కుండలేశ్వరం పుష్కర్ ఘాట్, నడవపల్లి పల్లెపాలెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును తాసిల్దార్ సందర్శించి వైద్య సదుపాయాలు, మందుల లభ్యతపై ఆరా తీశారు. వరద బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్శనలో డిప్యూటీ ఎంపీడీఓ ఎన్ శంకర్ నారాయణ, రెవెన్యూ, సచివాలయం సిబ్బంది పంచాయతీ సిబ్బంది, వైద్య శాఖల సిబ్బంది పాల్గొన్నారు.