కోనసీమ డిఇఓగా బాధ్యతలు చేపట్టిన మహబూబ్ బాషా*,
జనం న్యూస్:* ఆగస్టు 5ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ) డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు నూతన విద్యాశాఖ అధికారిగా నియమితులైన డాక్టర్ మహబూబ్ బాషా ఈరోజు ముమ్మిడివరంలోని ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజును వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మహబూబ్ బాషాకు శుభాకాంక్షలు తెలియజేసి, కోనసీమ జిల్లాలో విద్యా ప్రమాణాల అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. జిల్లాలో డ్రాప్ అవుట్ రేటు తగ్గించడం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం జిల్లా విద్యారంగ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై వారు పరస్పరం చర్చించుకున్నారు. విద్యాశాఖ చేపట్టే కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని దాట్ల సుబ్బరాజు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం, అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.-