బ్రూక్లిన్ గ్రామర్ హైస్కూల్‌లో అంగరంగ వైభవంగా బోనాల పండుగ

August 7, 2026 | తెలంగాణ

జనం న్యూస్, ఆగస్టు 7, జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి :తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను మెట్‌పల్లి పట్టణంలోని బ్రూక్లిన్ గ్రామర్ హైస్కూల్‌లో శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ పల్లె సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ బోనాల వేడుకలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఉత్సాహంతో సందడిగా సాగాయి.విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి, తలపై బోనాలను ఎత్తుకొని భక్తిశ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థినులు రంగురంగుల సాంప్రదాయ దుస్తుల్లో బోనాలతో పాల్గొనగా, విద్యార్థులు సంప్రదాయ వేషధారణలో ఆకట్టుకున్నారు. డప్పుల మోతలు, ఆటపాటలు, నృత్యాలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది.బోనాల వేడుకల్లో పోతురాజు విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోతురాజు వేషధారణలో చేసిన విన్యాసాలు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ఉత్సాహంగా కేరింతలు కొడుతూ బోనాల వేడుకలను ఆస్వాదించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ బుర్ర ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రత్యేక ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆచారాలు, సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయడంతో పాటు వాటి గొప్పతనాన్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరి సమక్షంలో బోనాల పండుగ వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుక విద్యార్థుల్లో ఆనందాన్ని నింపడంతో పాటు తల్లిదండ్రులను, సందర్శకులను ఆకట్టుకుంది.

🌐 Select Language:
📰 ePaper