దాబాల్లో మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు సీఐ చంద్రశేఖర్ రావు
జనం న్యూస్,అచ్యుతాపురం, ఆగస్టు09: అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు అచ్యుతాపురం మండల పరిధిలో ఉన్న దాబా యజమానులతో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్.చంద్రశేఖర్ రావు,ఎస్సైలు సుధాకర్, పోషణ గౌరీ మండల పరిధిలోని 7 ధాబాల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ దాబాలలో అక్రమంగా మద్యం విక్రయించినా లేదా మద్యం సేవించడానికి అనుమతించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాబాల వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా యజమానులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.దాబాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం అమ్మకాలు జరపరాదని, మద్యం సేవించేందుకు వినియోగదారులను అనుమతించకూడదని,దాబా ల ముందు రోడ్లపై లారీలు, ఇతర వాహనాలను అస్తవ్యస్తంగా నిలపడం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని,వాహనాలను నిర్దేశిత పార్కింగ్ స్థలాల్లోనే నిలిపేలా యజమానులు చర్యలు తీసుకోవాలని,దాబాల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా చూడాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సంబంధిత యజమానులపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి ధాబా వద్ద తప్పనిసరిగా సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ప్రజల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ఈ తనిఖీలు, సమావేశాలు నిర్వహిస్తున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే ధాబాలను సీజ్ చేయడానికి కూడా వెనుకాడమని స్పష్టం చేశారు.