ఏర్గట్లలో ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు

August 20, 2026 | వైరల్ వార్తలు

ఏర్గట్ల, ఆగస్టు 20: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ మాట్లాడుతూ.. భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక యుగం వైపు నడిపించడంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని అన్నారు. ప్రధానమంత్రిగా తన హయాంలో సమాచార సాంకేతికత, టెలికమ్యూనికేషన్ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. దేశంలోని యువతకు రాజకీయాల్లో మరింత భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు.అదేవిధంగా విద్యా రంగంలో సంస్కరణలకు ప్రాధాన్యత ఇచ్చి, దేశ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు జాతీయ విద్యా విధానానికి బాటలు వేశారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టారని, స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెంచేందుకు రిజర్వేషన్లకు ప్రతిపాదనలు చేసిన దూరదృష్టి కలిగిన నాయకుడని కొనియాడారు.దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పథంలో నడిపించేందు కు ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టడంతో పాటు, దేశంలో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పేందుకు పలు ప్రాంతాల్లో చర్చలు, ఒప్పందాలకు ప్రాధాన్యత ఇచ్చారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఆధునిక భారతదేశ నిర్మాణానికి పునాది వేసిన నాయకుల్లో రాజీవ్ గాంధీ ఒకరని పేర్కొన్నారు.కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. దేశ ఐక్యత, సమగ్రత, శాంతి కోసం రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన మహానేతగా ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. యువతను దేశ అభివృద్ధిలో భాగస్వాములను చేయడంతో పాటు సాంకేతిక రంగంలో భారత్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు రాజీవ్ గాంధీ చేసిన కృషిని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా నాయకులు, రాజీవ్ గాంధీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper