స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సమరశంఖం పూరించాలి
పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలి
జనం న్యూస్ ఆగస్టు 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ టీడీపీ సీనియర్ నేత వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ పిలుపురామచంద్రపురం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా పూర్తి స్థాయిలో సంసిద్ధం కావాలని టీడీపీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం పిలుపునిచ్చారు. రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన అధ్యక్షతన నియోజకవర్గస్థాయి పార్టీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త చిత్త శుద్ధితో, సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న ప్రతి కుటుంబాన్ని కలిసి, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.టీడీపీకి కార్యకర్తలే వెన్నెముక అని పేర్కొన్న వాసంశెట్టి సత్యం.. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తించి, వారికి తగిన ప్రాధాన్యత, గౌరవం కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ విజయానికి కృషి చేసే నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్తులో సముచిత గుర్తింపు లభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నాయకత్వంలో రామచంద్రపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని, ఈ అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పార్టీకి మంచి పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు.ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు టీడీపీ శ్రేణులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రారంభించాలని అన్నారు. ప్రతి బూత్‌ను బలోపేతం చేసి, ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నాయకత్వం ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కార్యకర్తలు ముందుండాలని పిలుపునిచ్చారు.పట్టణ అధ్యక్షులు ఉండవల్లి శివ, రూరల్ మండల అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు, కాజులూరు మండల అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి, కే.గంగవరం మండల అధ్యక్షులు మేడిశెట్టి రవికుమార్, స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ సలాది రమేష్ తదితరులు మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీలు,క్లస్టర్, కో-క్లస్టర్, సొసైటీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, యూనిట్, బూత్ స్థాయి సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రానున్న ఎన్నికలకు పార్టీని విజయపథంలో నడిపించేందుకు తమ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.