జనం న్యూస్ | : లిఫ్ట్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఎంతటి ప్రమాదం ఎదురవుతుందో తెలియజేసే విషాద ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. ఒంగోలు మార్కెట్ సెంటర్ సమీపంలోని సూర్య అపార్ట్మెంట్లో వినీత (50) అనే మహిళ లిఫ్ట్ నుంచి దిగే సమయంలో ప్రమాదవశాత్తు లిఫ్ట్, ఫ్లోర్ మధ్యలో ఇరుక్కుపోయారు. వివరాల ప్రకారం.. వినీతకు ముందు ఓ యువతి, చిన్నారి లిఫ్ట్ నుంచి బయటకు వెళ్లారు. ఆ సమయంలో లిఫ్ట్ డోర్ పూర్తిగా మూసుకునేలోపు బయటకు రావడానికి వినీత ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఆమె బయటకు వస్తున్న సమయంలోనే లిఫ్ట్ ఒక్కసారిగా కదలడంతో లిఫ్ట్, ఫ్లోర్ మధ్యలో చిక్కుకుపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వినీత అక్కడికక్కడే స్పృహ కోల్పోయారు. ఆమెను గమనించిన యువతి భయంతో కేకలు వేయడంతో అపార్ట్మెంట్ వాసులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వినీతను లిఫ్ట్ మధ్య నుంచి బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో లిఫ్ట్ వినియోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరంపై చర్చ జరుగుతోంది.