జనం న్యూస్ | : సాధారణంగా కోతులు ఇళ్లపైకి ఎక్కడం, పండ్లు లేదా తినుబండారాలను లాక్కెళ్లడం చూస్తుంటాం. కానీ జార్ఖండ్ రాజధాని రాంచీలో ఓ కోతి చేసిన వింత పని స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఏకంగా ఓ వైన్‌షాపులోకి దూరిన కోతి.. అక్కడ ఉన్న మద్యం బాటిల్‌ను తాగేసి, మత్తులో అదే షాపులో పడుకుని నిద్రపోయిన ఘటన వైరల్‌గా మారింది. రాంచీ పరిధిలోని ఒర్మాంజీ బ్లాక్ చౌక్ సమీపంలోని ఓ మద్యం దుకాణంలోకి శుక్రవారం అకస్మాత్తుగా ఓ కోతి ప్రవేశించింది. కోతిని బయటకు పంపేందుకు షాపు యజమాని ప్రయత్నించగా, అది అతనిపైకి దూకి కొరికినట్లు సమాచారం. దీంతో భయపడిన సిబ్బంది షాపు నుంచి బయటకు వెళ్లిపోయారు. దుకాణంలో ఎవరూ లేకపోవడంతో కౌంటర్‌పై ఉన్న ఓ లిక్కర్ బాటిల్‌ను కోతి తీసుకుని తాగినట్లు స్థానికులు తెలిపారు. కొద్దిసేపటికే మత్తులోకి జారుకున్న కోతి.. మద్యం దుకాణంలోనే పడుకుని నిద్రపోయింది. ఈ విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకుని కోతిని చూసేందుకు ఎగబడ్డారు. కొందరు ఈ వింత దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించడంతో వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కోతి గాఢంగా నిద్రపోతుండటంతో స్థానికులు అటవీ శాఖ, రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రెస్క్యూ బృందం కోతికి ఎలాంటి హాని కలగకుండా పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించింది. గతంలో సెలూన్‌లోకి వెళ్లి మసాజ్ చేయించుకున్న కోతి వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాంచీలో మద్యం దుకాణంలోకి వెళ్లి కోతి హల్‌చల్ చేసిన ఘటన కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు సరదాగా స్పందిస్తూ.. ‘మనుషుల అలవాట్లు కోతులకూ వచ్చేశాయేమో’ అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.