జనం న్యూస్ సెప్టెంబర్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి గండ్రవానిగూడెం గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి. తొమ్మిది రోజులపాటు వివిధ మండపాల్లో పూజలందుకున్న గణనాథుడికి ప్రీతిపాత్రమైన లడ్డూలను బుధవారం భక్తుల సమక్షంలో వేలం పాట నిర్వహించారు. గ్రామంలోని మూడు ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద జరిగిన ఈ వేలం కార్యక్రమాలకు భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ బొబ్బలి కావ్య శ్రీనివాస్ పర్యవేక్షణలో, మాజీ ఉపసర్పంచ్ కర్ర శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, ఆయా మండపాల కమిటీల ఆధ్వర్యంలో లడ్డూ వేలం పాటను నిర్వహించారు.
మూడు లడ్డూలకు రూ. 45,748 గ్రామంలోని రామాలయం సమీపంలో పూజలందుకున్న వినాయకుడి లడ్డూను సంకలమద్ది లత, సతీష్ రెడ్డి దంపతులు రూ. 15,116లకు వేలం పాటలో కైవసం చేసుకున్నారు. పడమర బజార్లోని వినాయక మండపంలో పూజలందుకున్న లడ్డూను కంచర్ల గౌతమి, రామసాని మేఘన, సిరిగిరి దివ్య ముగ్గురు స్నేహితులు కలిసి రూ. 15,516లకు దక్కించుకున్నారు. అదేవిధంగా బొడ్రాయి సమీపంలో పూజలందుకున్న వినాయకుడి లడ్డూను బొబ్బలి కవిత, శ్రీనివాస్ దంపతులు రూ. 15,116లకు వేలం పాటలో కైవసం చేసుకున్నారు. మూడు మండపాల్లో నిర్వహించిన వేలం పాటలో లడ్డూలకు మొత్తం రూ. 45,748 ఆదాయం సమకూరింది. నవరాత్రుల సందర్భంగా భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న లడ్డూలను వేలం ద్వారా దక్కించుకోవడం పట్ల విజేతలు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఐక్యత, భక్తిభావంతో విజయవంతంగా ముగిశాయని నిర్వాహకులు తెలిపారు.