తెలంగాణ

సున్నం చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన బండి రమేష్

సున్నం చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన బండి రమేష్

చెరువు పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత – త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జనం న్యూస్ నవంబర్ 7 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని సున్నం చెరువు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో గాయత్రి నగర్ డివిజన్ అధ్యక్షుడు మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి శనివారం చెరువు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గతంలో సున్నం చెరువులో కొంతభాగం ఆక్రమణలకు గురై నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో, వాటిని తొలగించి చెరువును పునరుద్ధరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్ నగరంలోని చెరువుల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సున్నం చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అభివృద్ధి పనులు చేపడుతోంది. ఈ సందర్భంగా బండి రమేష్ జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెరువు అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ. సున్నం చెరువు అభివృద్ధి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని వెల్లడించారు. చెరువు పరిసర ప్రాంతాల ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా వాకింగ్ ట్రాక్, భద్రతా ఏర్పాట్లు, పచ్చదనం తదితర ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల ఆక్రమణలను తొలగించి, వాటి పూర్వ వైభవాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో హైదరాబాద్ నగరంలోని చెరువులు మళ్లీ ఆక్రమణలకు గురికాకుండా పటిష్ఠమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అదేవిధంగా గాయత్రి నగర్ నుంచి 100 ఫీట్ల రహదారికి అనుసంధానంగా కనెక్టివిటీ రోడ్డు ఏర్పాటు చేయాలన్న స్థానిక ప్రజల విజ్ఞప్తిపై బండి రమేష్ సానుకూలంగా స్పందించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా స్థానిక రహదారిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ పుష్పారెడ్డి, డివిజన్ అధ్యక్షులు వాజిద్ పాషా, క్రాంతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేముల సత్యం, కనకయ్య, నరసింహ, రంగమోహన్, బర్కతలి, ప్రకాష్ ముదిరాజ్, నజీర్, లడ్డు, అడ్వాని అనిల్, రమణ, రవి, పిడికిటి గోపాల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్