తెలంగాణ

కెపిహెచ్‌బీ నాలుగో రోడ్డులో చెత్త కుప్పలు.

కెపిహెచ్‌బీ నాలుగో రోడ్డులో చెత్త కుప్పలు.

జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతంలో దుర్వాసన.. దోమలు, ఈగలతో ప్రజల అవస్థలు

జనం న్యూస్ సెప్టెంబర్ 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కెపిహెచ్‌బీ నాలుగో రోడ్డులోని సుబ్బయ్య హోటల్‌ పక్కన చెత్త పేరుకుపోవడంతో స్థానికులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతం నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండటంతో పాటు ఆసుపత్రులకు వెళ్లే వారు, దేవాలయానికి వెళ్లే భక్తులు ఇదే మార్గాన్ని వినియోగి స్తుంటారు. అలాంటి ప్రధాన రహదారి పక్కనే చెత్త పేరుకుపోవడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఈ సమస్యలో మున్సిపల్‌ సిబ్బంది నిర్లక్ష్యం కంటే ప్రజల బాధ్యతారాహిత్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కొందరు పాదచారులు, మరికొందరు కాలనీవాసులు ఇళ్లలోని చెత్తను తీసుకొచ్చి రహదారి పక్కన పడేస్తుండటంతో చెత్త కుప్పలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చెత్తను నిర్దేశిత ప్రాంతాల్లో వేయాల్సిన బాధ్యతను విస్మరించి బహిరంగ ప్రదేశాల్లో పడేయడం వల్ల పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది.ప్రత్యక్షంగా చూస్తే మరింత ఆందోళన కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ద్విచక్ర వాహనాలపై వచ్చే కొందరు వ్యక్తులు అక్కడే వాహనాలను ఆపి చెత్త సంచులను పడేసి వెళ్లిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇలా రహదారి పక్కన చెత్త వేయడం వల్ల కొద్దిసేపటికే దుర్వాసన వ్యాపిస్తోందని, చెత్తపై దోమలు, ఈగలు చేరుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆసుపత్రులకు వెళ్లే రోగులు, వారి బంధువులు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఇదే మార్గంలో రాకపోకలు సాగిస్తుండటంతో చెత్త దుర్వాసనతో తీవ్ర అసౌకర్యాని కి గురవుతున్నారు. దేవాలయానికి వెళ్లే ప్రధాన దారిలో ఇలాంటి పరిస్థితి ఉండటంతో భక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతంలోనే చెత్తను పడేయడం వల్ల పరిసరాల పరిశుభ్రతకు భంగం కలగడమే కాకుండా ప్రజారోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల్లో మార్పు రావాలిమున్సిపల్‌ సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్తను తొలగించినప్పటికీ కొందరు ప్రజలు మళ్లీ అదే ప్రదేశంలో చెత్త వేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం ఉండదని స్థానికులు అంటున్నారు. పట్టణ పరిశుభ్రత అనేది కేవలం అధికారుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా భావించాలని వారు కోరుతున్నారు.ప్రధాన రహదారి పక్కన చెత్త వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, పదేపదే చెత్త వేస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అవసరమైన చోట్ల నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి బహిరంగంగా చెత్త వేస్తున్న వారిని గుర్తించే చర్యలు తీసుకుంటే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందని వారు అభిప్రాయ పడుతున్నారు. నిఘా పెంచితేనే సమస్యకు అడ్డుకట్ట కెపిహెచ్‌బీ నాలుగో రోడ్డు వంటి జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో బహిరంగంగా చెత్త వేయకుండా సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున చెత్త వేసే వారిపై నిఘా పెంచి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.పరిశుభ్రమైన పరిసరాలు కావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ముందుగా తమ బాధ్యతను గుర్తించాలి. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయడం ద్వారా సమస్యను సృష్టించి, అదే సమస్యపై అధికారులను నిందించడం సరికాదని స్థానికులు అంటున్నారు. ప్రజల సహకారం, అధికారుల పర్యవేక్షణ కలిస్తేనే కెపిహెచ్‌బీ నాలుగో రోడ్డులోని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వారు పేర్కొంటున్నారు.

ఇ-పేపర్