ఆంధ్రప్రదేశ్

కాలేజ్ ముసుగులో భూమి కబ్జా

కాలేజ్ ముసుగులో భూమి కబ్జా

ఆధ్యాత్మికం పేరిట విలువైన భూములు స్వాహా జనం న్యూస్ -సెప్టెంబర్ 30- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ 6వ వార్డులో ఏఈఎల్ చర్చి పక్కన స్థలంలో అక్రమ కట్టడాలు దర్జాగా వెలుస్తున్నాయి. ఆధ్యాత్మిక శిక్షణ బైబిల్ కాలేజీ నిర్మాణం ముసుగులో రక్షిత అటవీ భూములను కొందరు వ్యక్తులు ఆక్రమిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకుని విలువైన అటవీ భూమిని క్రమంగా ఆక్రమిస్తూ శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం కేటాయించిన రక్షిత అటవీ సరిహద్దులను దాటి చెట్లను నరికి వేస్తూ యదేచ్ఛగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఆ స్థలంలో ఉన్న టేకు చెట్లను, పండ్ల మొక్కలను సైతం నరికివేసి కట్టడాలను నిర్మిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బైబిల్ కాలేజీ పేరుతో హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి నందికొండ మున్సిపాలిటీ నుంచి & స్థానిక ఎన్ఎస్పి అధికారుల నుంచి గాని ఎటువంటి పర్మిషన్లు తీసుకోకుండానే మొదట తాత్కాలిక షెడ్లు వేసి, ఇప్పుడు నెమ్మదిగా పక్కాభవనాలుగా మారుస్తున్నారు. టైగర్ వ్యాలీ లోకి విస్తరిస్తున్న శాశ్వత నిర్మాణాలను తక్షణమే అధికారులు అడ్డుకోవాలని స్థానికులు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ఈ స్థలం మొదట ఏఈఎల్ చర్చి ది కాగా బైబిల్ కాలేజీ పేరుతో ఈ వ్యక్తి ఆక్రమించుకున్నట్లుగా తెలుస్తుంది. అటవీ భూములలో ఎటువంటి నిర్మాణాలకు చేపట్టకూడదని స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి కళ్ళముందే ఆక్రమణలు జరుగుతున్న అటు అటవీశాఖ యంత్రాంగం కానీ ఎన్ఎస్పి అధికారులు గానీ చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జునసాగర్ పరిధిలోని అమూల్యమైన అటవీ సంపదను భూములను కాపాడాలని స్థానికులు పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. బైబిల్ కాలేజీ పేరుతో జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణం పై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించి ఆక్రమణలను తొలగించాలని కోరుతున్నారు. ఈ బైబిల్ కాలేజీ గురించి విచారించగా బైబిల్ ట్రైనింగ్ పేరుతో ఫీజులు వసూలు చేసి క్లాసులు నడవకుండానే కోర్సు పూర్తయిన విధంగా సర్టిఫికెట్లు అంద చేస్తున్నారన్న విషయం బయటపడింది. కోర్సు చదవకుండానే సర్టిఫికెట్లు ఇస్తుండడంతో విద్యార్థులు సైతం ఇటువంటి కాలేజీల వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎవరూ కూడా ఇటువైపు కన్నెత్తి చూడకపోవడానికి కారణం ఈ స్థలం ఆక్రమించిన వ్యక్తి లయన్స్ క్లబ్ నాగార్జునసాగర్ చైర్మన్ గా ఉన్నట్లుగా స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఆక్రమణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పర్యావరణవేత్తలు కోరుతున్నారు. కాలేజీ పర్మిషన్లపై కూడా సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇ-పేపర్